బౌద్ధాయన

బౌద్ధాయనుడు క్రీ.పూ 8 వ శతాబ్దం క్రీ.పూ 6 వ శతాబ్దం మధ్య కాలము వాడు. తను ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడుగా పురాతన గ్రంధం 'మహార్ణవ' ద్వారా తెలుస్తుంది.

శుల్బ లేక శుల్వ లేక సుళ్వ అనే పదాలు 'త్రాడు' 'కొలిచేది' 'కొలిచేవి' అనే అర్ధాన్ని ఇస్తాయి. త్రాడు నుపయోగించి కొలిచే నైపుణ్యం ఉన్న వారిని 'శుల్బ విదుల'ని పిలుస్తారు. వేదకాలంలో 'దేవాలయం' అనే భావం లేదు. వేద విధులు ఇంటిలోగాని, లేక ఆరుబయట సమతల ప్రదేశంలోగాని 'వేధి''అగ్ని' నిర్మించి నిర్వహించేవారు. 'వేధి' యజ్ఞకర్మల కుద్దేశించిన కొలతల ప్రకారం ఎత్తుగా చేయబడిన సమతల పీఠం. 'అగ్ని' దానిపైన ఇటుకలతో నిర్మించబడి అగ్నిని నిలపటానికి ఉపయోగించే నిర్మాణం. వీనిలో అనేక రకాలు ఉంటాయి. సమద్విబాహు త్రిభుజం, రాంబస్, రధచక్రం, వృత్తము, ట్రపీజియం ఆకారాలలో నిర్మాణాలున్నాయి. ఈ విదముగా రేఖాగణితం లేదా క్షేత్రగణితం అంశాలను కొన్ని నియమాలతో కొలిచే నైపుణ్యం, పాండిత్యాన్ని శుల్బవిజ్ఞానమని, ఇది తెలిసిన నిపుణులను 'శుల్బ విదుల'ని ఆ కాలంలో పిలిచేవారు. మత పరమైన కర్మలు నిర్వహించే ఈ పండితులకు లోకంలో వీరికి గొప్ప గౌరవము వుండేది.

ఇప్పటి వరకు మనకున్న సమాచారం బట్టి ఇటువంటి పండితుడు తర్వాత కాలానికి మార్గదర్సకుడుగా పేరుగాంచినవాడు బౌద్ధాయనుడు. బౌద్ధాయన శుల్బ సూత్రాలలో

1. అణు, అంగుళ, పాద, జాను, సమ్య, భాహు, ప్రక్రమ, అరత్ని మొదలైన కొలతలు, వాని మధ్య సంబంధాలు

2. చతురస్రనిర్మాణాలు - వానిలో వివిధ పద్ధతులు

3. దీర్ఘ చతురస్ర నిర్మాణాలు - వివిధ పద్ధతులు

4. చతురస్ర కర్ణం ఏర్పరచు చతురస్రవైశాల్యం దత్త చతురస్ర వైశాల్యానికి రెట్టింపు (√2, √3 విలువలు)

5. దీర్ఘచతురస్రము రెండు భుజాలచే ఏర్పడు చతురస్రాల (వైశాల్యాల) మొత్తం దాని కర్ణము ఏర్పరుచు వైశాల్యానికి సమానం అనే సూత్రం (ప్రస్తుతము పైథాగరస్ సిద్ధాంతముగా పిలువబడుచున్నది) దానిపై సంఖ్యాపరమైన ఉదాహరణలు.

6. రెండు వేరు వేరు కొలతలు గల చతురస్రాలను కలుపుట, లేదా ఒకదాని నుండి మరొకటి తీసివేయుట.

7. చతురస్రాన్నిదీర్ఘచతురస్రంగాను, దీర్ఘచతురస్రాన్ని చతురస్రం గాను మార్పు చేయుట, చతురస్రాన్ని సమద్విబాహు ట్రపీజియంగా, సమబాహు త్రిభుజంగా, సమద్విబాహు త్రిభుజంగా మార్పు చేయుట.

8. చతురస్రాన్ని వృత్తంగా, వృత్తాన్ని చతురస్రంగా మార్చుట.

9. ఏ విధమైన 'అగ్ని' ని ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాలలో దిక్కులలో ఎలా ఉంచాలి, వాటికి సంబంధించిన దూరాలు, కొలతలు, వాటి వైశాల్యాలు, అవి పెంచుట లేక తగ్గించుటకు పద్ధతులు

10. ఏ యే 'అగ్ని' (హోమగుండం) ఎన్ని ఇటుకలతో, వివిధ తలాలతో, అంచెలంచెలుగా వివిధ ఆకారాలతో, ఎలా నిర్మించాలో, ఇటుకలపై గుర్తులు ఎలా ఉంచాలో, వివిధ ఆకారాలలోని ఇటుకలు ఎక్కడ ఉపయోగించాలో తెలిపే వివరాలు.

11. యజ్ఞం ఏ ఉద్దేశ్యంతో చేస్తారో - దానికి తగిన వేధి నిర్మాణం, వేధి - అగ్ని నిర్మాణాలలో దశలు, ఇటుకల సంఖ్య, యజ్ఞం నిర్వహించేవారు ఏ ఏ స్థానాలలో ఎలా కూర్చుంటారు అనే అంశాలు.

12. మరికొందరు ఈ నిర్మాణాలు ఎలా ఉండాలి అనే విషయంపై ఏమి చెప్పినది.

      మొదలైన వివిధ విషయాలు ఉన్నాయి.